CPI Narayana: 'హైడ్రా' పని భేష్... రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గొద్దు: సీపీఐ నారాయణ
- హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాపై ప్రశంసలు
- సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్న నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న పని భేష్ అని కొనియాడారు.
"నగరంలో చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి! అరగంట వర్షం పడితే ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నగరం ముంపునకు గురవుతోంది. ఆ సమయంలో ప్రజల అవస్తలు వర్ణనాతీతం. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి మంచి పని చేసింది.
అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు. ఆయన ఎట్టిపరిస్థితుల్లో పులి మీద నుంచి దిగకూడదు. దిగితే మింగేసే ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులు కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర సర్కార్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఇక హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలి" అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్రంపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపేయేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని దుయ్యబట్టారు. అదానీకి సెబీ సలాం కొడుతుందని, ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.