Annamalai: రజనీకాంత్ 'ఓల్డ్ స్టూడెంట్స్' వ్యాఖ్య... స్టాలిన్‌పై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు
- మహామహులు ఉన్న పార్టీని స్టాలిన్ ఎలా సమన్వయం చేస్తున్నారో అన్న రజనీకాంత్
- సూపర్ స్టార్ వ్యాఖ్యలు స్టాలిన్‌కు హెచ్చరికగా కనిపిస్తోందన్న అన్నామలై
- ఎవరినీ నొప్పించకుండా రజనీకాంత్ వాస్తవాలు చెప్పారని వ్యాఖ్య
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంగం స్టాలిన్‌కు ఒక హెచ్చరికగా తనకు కనిపిస్తోందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ పార్టీని చాలా సమన్వయం చేస్తున్నారని, ఒక టీచర్‌కు కొత్త విద్యార్థిని దారిన పెట్టే విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని, కానీ ఓల్డ్ స్టూడెంట్స్ ను సమన్వయం చేయడం అంత సులభం కాదన్నారు. ఆ పాత విద్యార్థులు కూడా మంచి ర్యాంకు హోల్డర్స్ అని, వారిలో దురై మురుగన్ వంటి వారు ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి మహామహులు ఉన్న పార్టీని స్టాలిన్ ఎలా సమన్వయం చేస్తున్నారో? హ్యాట్సాఫ్ స్టాలిన్ అని రజనీ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై అన్నామలై ఆసక్తికరంగా స్పందించారు. రజనీకాంత్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి హెచ్చరికగా కనిపిస్తున్నాయన్నారు. దురై మురుగన్, ఈవీ వేలు వంటి వారు ఉండగా ఉదయనిధి స్టాలిన్‌కు బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు వస్తుందనేది దాని సారాంశమన్నారు. ఎవరినీ నొప్పించకుండా రజనీకాంత్ తనదైన శైలిలో వాస్తవాలు చెప్పారన్నారు.