Rohan Jaitley: త‌దుప‌రి బీసీసీఐ కార్యదర్శిగా త‌న పేరు వినిపించ‌డంపై రోహన్ జైట్లీ ఏమ‌న్నారంటే..!

Rohan Jaitley says not moving from DDCA to BCCI if Jay Shah joins ICC

  • నవంబర్‌తో ముగియనున్న ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే పదవీకాలం 
  • బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్ర‌చారం
  • దీంతో త‌దుప‌రి బీసీసీఐ కార్యదర్శిగా తెర‌పైకి రోహన్ జైట్లీ పేరు 
  • బీసీసీఐ సెక్ర‌ట‌రీ రేసులో ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను కొట్టిపారేసిన రోహన్

బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది. అయితే మరోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరాసక్తి వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ సెక్రట‌రీ జై షా పోటీలో నిలుస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. 

ఒకవేళ ఆయన నిజంగానే బరిలోకి దిగితే తర్వాత బీసీసీఐ కార్యదర్శిగా ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఓ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి తనయుడు పేరు తెరపైకి వచ్చింది. అత‌నే ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి రేసులో ముందున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా ఆయ‌న ఈ వార్త‌ల‌ను ఆయన కొట్టిపారేశారు. తాను బీసీసీఐ సెక్ర‌ట‌రీ రేసులో ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నారు. ప్ర‌స్తుతం తాను ఢిల్లీ లీగ్‌ను ప్ర‌మోట్ చేయ‌డంపైనే దృష్టిసారించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. 
 
ఇక ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికల బరిలో నిలిస్తే ఐసీసీ నూతన ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే జై షా ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవితో పాటు, బీసీసీఐ సెక్రటరీ పదవుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. 

ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న గ్రెగ్‌ బార్‌ క్లే ఈ న‌వంబ‌ర్‌లో త‌న ప‌ద‌వీకాలం ముగిసిన వెంట‌నే వైదొలుగుతాన‌ని గ‌త వారం బోర్డుకు అధికారికంగా తెలియ‌జేశాడు. మొద‌ట 2020 న‌వంబ‌ర్‌లో ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్య‌తులు చేప‌ట్టిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత 2022లో మ‌రోసారి ఈ ప‌ద‌వికి తిరిగి ఎన్నిక‌య్యారు.

  • Loading...

More Telugu News