Kavitha: తన కోడలు కవితకు బెయిల్ రావడం పట్ల మామ రామకృష్ణారావు ఏమన్నారంటే...!
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్
- ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- కవిత ఏ తప్పు చేయలేదన్న మామ రామకృష్ణారావు
- కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమె కుటుంబ సభ్యుల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. తాజాగా, కవిత భర్త అనిల్ తండ్రి రామకృష్ణారావు కూడా ఆనందం వ్యక్తం చేశారు. తన కోడలు కవితకు బెయిల్ రావడం పట్ల ఆయన మీడియాతో మాట్లాడారు.
"కవిత సుమారు 6 నెలలు జైలు జీవితం అనుభవించింది. ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఎంతో ధైర్యంగా ఉంది. మాకే ధైర్యం చెప్పింది. ఆలస్యమైనా న్యాయమే గెలిచింది. కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తుందన్న నమ్మకం మాకుంది. కవిత ఇటీవల జ్వరంతో బాధపడింది. 10 కిలోల బరువు తగ్గినప్పటికీ, ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు.
కవిత ఏ తప్పు చేయలేదని మేం నమ్ముతున్నాం. ఆమె పది మందికి సాయం చేయాలన్న మనస్తత్వం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఆడపడుచులు, అన్నదమ్ముల ఆశీస్సులు ఆమెకు ఉన్నాయి.
ఈ సాయంత్రానికి కవిత జైలు నుంచి బయటికి వస్తుందని భావిస్తున్నాం. కేటీఆర్, హరీశ్, న్యాయవాదులు అవసరమైన పత్రాలు తీసుకుని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. అక్కడ్నించి బెయిల్ పత్రాలు తీసుకుని తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఇదంతా పూర్తయ్యేసరికి మరో మూడు గంటల సమయం పడుతుందని అనుకుంటున్నాం. ప్రజలు కవిత కోసం స్వచ్ఛందంగా ఢిల్లీకి వచ్చారు" అని ఆమె మామ రామకృష్ణారావు వివరించారు.