Jagan: సీఎం చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ
- ప్రజారోగ్యానికి కూటమి సర్కారు ఉరి బిగిస్తోందన్న జగన్
- సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తున్నారని ఆగ్రహం
- వెంటనే ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురావాలంటూ లేఖ
రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోంది అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తున్నారని, ఇప్పటికే స్పెషలిస్ట్ డాక్టర్ల సహా సిబ్బంది నియామకాలను ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని జగన్ విమర్శించారు.
మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నారని, తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ ఏడాది ఆయా కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని జగన్ స్పష్టం చేశారు.
"అన్ని వసతులు ఉన్నప్పటికీ మీ వైఖరి కారణంగా ఈ కాలేజీలకు గ్రహణం పట్టింది. కేంద్రంలోని బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇది మీ వైఫల్యమే. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు మెడికల్ కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరుతున్నాను" అంటూ జగన్ తన లేఖలో పేర్కొన్నారు.