Spain: టీ20 క్రికెట్ చరిత్రలో పసికూన స్పెయిన్ నయా ప్రపంచ రికార్డు!
- పెద్ద జట్లకు కూడా సాధ్యంకాని రీతిలో స్పెయిన్ ఖాతాలో వరుసగా 14 విజయాలు
- వరల్డ్‌కప్ సబ్ రీజినల్ యూరప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్రీస్‌పై గెలుపుతో ఈ ఘనత
- ఇలా వరుస 14 విక్టరీలతో బెర్ముడా, మలేసియా రికార్డులను బ్రేక్ చేసిన స్పెయిన్
- ఇక ఐసీసీ ఫుల్‌టైమ్ మెంబర్లు అయిన భారత్, ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 గెలుపులు
సాకర్ ఆటలో తిరుగులేని స్పెయిన్ ఇప్పుడు క్రికెట్‌లోనూ సత్తా చాటుతోంది. ఇప్పుడిప్పుడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్న ఈ పసికూన పెద్ద జట్లకు కూడా సాధ్యంకాని రీతిలో అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో వరుసగా అత్యధిక విజయాలు (14) సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
వరల్డ్‌కప్ సబ్ రీజినల్ యూరప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్రీస్‌పై గెలుపుతో ఈ ఘనత సాధించింది. గ్రూప్-సీలో ఉన్న స్పెయిన్ ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో గ్రూప్ టాపర్‌గా ఉంది.
ఇలా వరుస 14 విక్టరీలతో బెర్ముడా, మలేసియా రికార్డులను స్పెయిన్ బద్దలు కొట్టింది. 2021లో బెర్ముడా, 2022లో మలేసియా వరుసగా 13 విజయాలు సాధించాయి. ఇక ఐసీసీ ఫుల్‌టైమ్ మెంబర్ జట్లు అయిన భారత్, ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 విజయాలు సాధించడం జరిగింది.
ఇక మహిళల టీ20 క్రికెట్ వరుస అత్యధిక విజయాల రికార్డును థాయ్‌లాండ్ కలిగి ఉంది. 2018 నుంచి 2019 మధ్య ఆ జట్టు వరుసగా ఏకంగా 17 విజయాలు నమోదు చేయడం విశేషం. అలాగే ఆస్ట్రేలియా 16 గెలుపులతో తర్వాతి స్థానంలో ఉంది.