Bengal Bandh: బెంగాల్ లో హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతున్న డ్రైవర్లు.. వైరల్ వీడియో
- బీజేపీ బంద్ పిలుపుతో పలుచోట్ల ఉద్రిక్తతలు
- హెల్మెట్ పెట్టుకుని డ్యూటీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
- బస్ డ్రైవర్లకు హెల్మెట్లు అందజేసిన అధికారులు
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, కూచ్ బెహర్ సిటీలలో బుధవారం ఆర్టీసీ బస్ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ చేశారు. ప్రభుత్వ బస్సులలో దాదాపుగా డ్రైవర్లు అందరూ హెల్మెట్లు పెట్టుకుని బస్సు నడపడం కనిపించింది. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బైక్ నడుపుతున్నపుడు హెల్మెట్ తప్పనిసరి కానీ బస్సు నడపడానికి హెల్మెట్ ఎందుకని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులు డ్రైవర్లను కదిలించగా.. ప్రభుత్వమే తమను హెల్మెట్ పెట్టుకోమని చెప్పిందని వివరించారు. డ్యూటీ ఎక్కేముందు ఉన్నతాధికారులు స్వయంగా తామందరికీ హెల్మెట్ ఇచ్చారని చెప్పారు.
కారణం ఏంటంటే..
కోల్ కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఇటీవల ట్రెయినీ డాక్టర్ ఒకరు దారుణ హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా.. మంగళవారం కోల్ కతాలో విద్యార్థులు మెగా నిరసన ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అదికాస్తా హింసాత్మకంగా మారింది. అటు పోలీసులు, ఇటు నిరసనకారులు గాయాలపాలయ్యారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలంతా స్వచ్చందంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ బంద్ పిలుపును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని, ఎలాగైనా బంద్ ను విఫలం చేయాలని అధికారులను ఆదేశించింది. సెలవులో ఉన్నవారు, అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో బంద్ కారణంగా ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఆలోచనతో హెల్మెట్లు ధరించి డ్యూటీ చేయాలని సూచించింది. దీంతో బస్ డిపోలలో ఉన్నతాధికారులు ఆర్టీసీ డ్రైవర్లకు హెల్మెట్లు అందజేశారు.