K Kavitha: అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత... కేటీఆర్ ఏమన్నారంటే...?

MLC Kavitha tied Rakhi to brother KTR


ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బెయిల్‌‌పై మంగళవారం విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ (బుధవారం) హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. దీంతో నివాసంలో భావోద్వేగం వాతావరణం నెలకొంది. తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. 

ఈ నెలలో జరిగిన రాఖీ పండగ సమయంలో ఆమె జైలులో ఉండడంతో రాఖీ కట్టలేకపోయారు. దీంతో ఇవాళ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

చెల్లి రాఖీ కట్టడంపై కేటీఆర్ కూడా స్పందించారు. "రాఖీ ఫీలింగ్ తీరిపోయింది" అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. కవిత ఇంటికి విచ్చేసిన సందర్భంగా ఇంట్లో నెలకొన్న భావోద్వేగ వాతావరణానికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు.

కాగా, రాఖీ పండుగ రోజున కేటీఆర్ సోషల్ మీడియా భావోద్వేగ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు కవిత జైలులో ఉండడంతో ఆమె గతంలో రాఖీ కట్టిన ఫొటోను షేర్ చేశారు. "ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయినా నీకు అన్నగా ఎప్పటికీ అండగా ఉంటాను" అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇవాళ కవిత రాఖీ కట్టడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఆత్మీయ స్వాగతం..

నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు పూలస్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవితను ఆలింగనం చేసుకొని తల్లి శోభ కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ కవిత కూడా విలపించారు. ఇతర కుటుంబ సభ్యులు వారిని ఓదార్చారు.

నిజం నిలకడ మీద తెలుస్తుంది: కవిత

అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఇంటికి చేరుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, ఆ రోజు కోసం పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె అన్నారు. ధర్మం గెలుస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాల్లో పాల్గొంటానని ఆమె వెల్లడించారు.


  • Loading...

More Telugu News