Mopidevi Venkataramana: జగన్ కోసం నేను చేసిన త్యాగాల మాటేమిటి?: విమర్శకులకు మోపిదేవి ఎదురు ప్రశ్న

Mopidevi Venkata Ramana Sensational Comments On YS Jagan
  • 'ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి పదవి ఇచ్చాం' అనడంపై మోపిదేవి ఫైర్
  • రాజీనామా నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని వివరణ
  • మీడియాతో అన్నీ చెప్పుకోలేమని వ్యాఖ్య
వైసీపీకి రాజీనామా చేయాలన్న తన నిర్ణయంపై చాలామంది విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ తాజాగా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీని చేశామని, మంత్రి పదవి కట్టబెట్టామని మాట్లాడుతున్నారని, అయితే, పార్టీ అధినేత వైఎస్ జగన్ కోసం తాను చేసిన త్యాగాల గురించి ఏ ఒక్కరూ నోరెత్తడంలేదన్నారు. తన రాజీనామా నిర్ణయం వెనక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతూ.. అన్నీ మీడియా ముందు చెప్పుకోలేమని వ్యాఖ్యానించారు. ఈమేరకు గురువారం ఓ మీడియా సంస్థతో మోపిదేవి మాట్లాడారు. వైసీపీని వీడాలనే నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. బాగా ఆలోచించి, అధిష్ఠానం తీరు మారుతుందేమోనని వేచి చూశాకే పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు మోపిదేవి వివరించారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని జగన్ తో మాట్లాడగా.. క్షణం కూడా ఆలోచించకుండా కుదరదని చెప్పేశారని మోపిదేవి తెలిపారు. అది తనకు అసంతృప్తి కలిగించిందన్నారు. నేటి రాజీనామా నిర్ణయానికి ఆ క్షణంలోనే బీజం పడిందని వివరించారు. అయితే, అధిష్ఠానంలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వస్తోందన్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

Mopidevi Venkataramana
YS Jagan
YSRCP
Rajya Sabha MP
Andhra Pradesh

More Telugu News