VH: కుటుంబ సభ్యుల ఇల్లు కూడా రేవంత్ రెడ్డి కూల్చేయమన్నారు: వి.హెచ్.
- రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా నోటీసులపై స్పందించిన వి.హెచ్.
- హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి భేషైన వ్యవస్థను తీసుకువచ్చారని కితాబు
- రాహుల్ గాంధీపై కంగన చేసిన వ్యాఖ్యల మీద వి.హెచ్. ఆగ్రహం
- అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
తన కుటుంబ సభ్యుడి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే... దానినీ కూల్చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం శుభపరిణామమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. దుర్గం చెరువును ఆనుకొని ఉన్న అమర్ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఇల్లు ఉంది. ఈ ఇంటికి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన హైడ్రా కూల్చివేతలపై స్పందించారు.
హైదరాబాద్‌లో చెరువులు, ఇతర వనరుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా తీసుకువచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి భేషైన వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చక్కగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయాల్సి వస్తే మాత్రం వారికి ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలని సూచించారు.
కంగనా రనౌత్‌పై ఆగ్రహం
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు, కంగనపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాప్యులారిటీ కోసం కంగన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదైనా ఉంటే ఆమె పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు.
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చెత్తగా మాట్లాడుతారని, డ్రగ్స్ తీసుకుంటారని కంగన ఆరోపించారు. ఆయన పద్ధతి లేని వ్యక్తి అని, కుర్చీ కోసం పాకులాడే వ్యక్తి అని, ప్రతిసారి తన దారిని మార్చుకుంటారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై వి.హెచ్. ఆగ్రహం వ్యక్తం చేశారు.