Himachal Pradesh: ప్రకృతి విపత్తు... వేతనం తీసుకోవద్దని నిర్ణయించుకున్న హిమాచల్ సీఎం, మంత్రులు
- భాగం కానున్న చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, ఉన్నతాధికారులు
- రెండు నెలలు వేతనాలు తీసుకోవద్దని నిర్ణయించినట్లు సీఎం ప్రకటన
- అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని సూచన
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులతో హిమాచల్ ప్రదేశ్ అల్లకల్లోలంగా మారింది. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలు వేతనాలు తీసుకోవద్దని కేబినెట్ నిర్ణయించింది. చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా వేతనాలకు దూరంగా ఉండనున్నారు.
ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సఖు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. మరికొంత మంది ఆచూకీ గల్లంతైంది. జూన్ 27 నుంచి ఆగస్ట్ 9 మధ్యలో 100 మంది మృతి చెందారు. బ్రిడ్జిలు, రోడ్లు దెబ్బతిన్నాయి.
దీంతో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. విపత్తు అనంతరం పునర్నిర్మాణం కింద రూ. 9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వెల్లడించారు.