Deputy CM Pawan Kalyan: పిఠాపురం ఆడపడుచులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక
- నేడు పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
- ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12వేల చీరలు పంచనున్న పవన్
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కల్యాణ్ పసుపు కుంకుమ కానుక పేరిట కార్యక్రమం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు ప్రత్యేక కానుక ఇవ్వనున్నారు. శ్రావణమాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు అందజేయాలని నిర్ణయించారు.
పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కల్యాణ్ పసుపు కుంకుమ కానుక పేరిట ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగుల్లో చీరతో పాటు పసుపు, కుంకుమలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు రెండు రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని జనసేనాని నివాసంలో జరుగుతున్నాయి.
దీంతో వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం పాదగయ క్షేత్రానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటలకు కేవలం 2వేల మందికే టోకెన్లు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా 6వేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ దుర్గాభవాని చెప్పారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు.