Shah Rukh Khan: షారుఖ్ ఖాన్, అమితాబ్, హృతిక్ రోషన్‌లలో ఎవరి ఆస్తి ఎక్కువ?

Here is the Bollywood richest and their net worth including Shah Rukh Khan and Amitabh Bachchan
  • రూ.7,300 కోట్ల నికర ఆస్తితో సంపన్న బాలీవుడ్ స్టార్‌గా నిలిచిన షారుఖ్ ఖాన్
  • రూ.4,600 కోట్లతో రెండో స్థానంలో జూహీ చావ్లా
  • అమితాబ్ బచ్చన్ సంపద రూ.1,600 కోట్లు, హృతిక్ ఆస్తి రూ.2,000 కోట్లు
షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, జూహీ చావ్లాతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్లకు ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్‌ ఉంది. వీరంతా సినిమాలతో పాటు ఇతర మార్గాల్లోనూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరి బాలీవుడ్‌ స్టార్లలో అత్యంత సంపన్న నటుడు ఎవరు? ఎవరెవరికి ఎంత ఆస్తి ఉంది? అనే ఆసక్తికరమైన డేటాను ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్’ వెల్లడించింది.

దీని ప్రకారం, మొత్తం రూ.7,300 కోట్ల నికర ఆస్తి విలువతో షారుఖ్ ఖాన్ అత్యంత సంపన్న బాలీవుడ్ స్టార్‌గా నిలిచాడు. సినిమాల్లో నటన, సినిమాల నిర్మాణం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో పాటు ఇతర మార్గాల్లోనూ అతడు సంపాదిస్తున్నాడు. అతడి సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పలు బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించింది. ఇందులో షారుఖ్ నటించిన 'పఠాన్', 'జవాన్'తో పాటు అనేక హిట్ మూవీస్ ఉన్నాయి. అత్యధిక డిమాండ్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులు, సేవలకు ప్రచారం చేశాడు. అతడి వద్ద ఇంకా అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి. షారుఖ్ పాప్యులారిటీ, సోషల్ మీడియా ఫాలోయింగ్ దృష్ట్యా మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లాలంటే షారుఖ్‌తో ప్రచారం చేయించుకోవడం లాభదాయకమని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఇక వినోదం, క్రీడా రంగంలో పెట్టుబడులు పెడుతున్న జూహీ చావ్లా రూ.4,600 కోట్ల నికర సంపదతో రెండవ సంపన్న బాలీవుడ్ స్టార్‌గా నిలిచారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ తెలిపింది. రూ.2,000 కోట్ల నికర ఆస్తులతో నటుడు హృతిక్ రోషన్ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు. సినిమాల్లో నటనతో పాటు ఫిట్‌నెస్ బ్రాండ్ కంపెనీ హెచ్‌ఆర్ఎక్స్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. ఇక బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, అతడి కుటుంబ ఆస్తి విలువ రూ.1,600 కోట్లుగా ఉంది. ఆ తర్వాత నిర్మాత కరణ్ జొహార్ నికర ఆస్తి విలువ రూ.1,400 కోట్లు అని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది.
Shah Rukh Khan
Amitabh Bachchan
Bollywood
Hurun India Rich List

More Telugu News