DK Aruna: ఎన్నికల కలెక్షన్ల కోసమే 'హైడ్రా': ఎంపీ డీకే అరుణ
- కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
- మహబూబ్నగర్లో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల ఎంపీ అరుణ మండిపాటు
- గత ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వం కూల్చేస్తోందని విమర్శ
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ను తీసుకువచ్చారు. ఇప్పుడీ సంస్థ కబ్జాదారులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఆక్రమణలను తొలగించడం చేస్తోంది హైడ్రా.
సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు అనే తేడా లేకుండా, ఆక్రమణ రుజువైతే కట్టడాలను కూల్చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు నేతలు హైడ్రాకు పూర్తి మద్దతు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం కన్నెర్ర చేస్తున్నారు.
ఇక హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. మహబూబ్నగర్లో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల ఆమె మండిపడ్డారు. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కలెక్షన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
ఆక్రమణ జరిగితే ఓ పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వం కూల్చేస్తోందని విమర్శించారు. హామీలను అమలు చేయలేకే హైడ్రా పేరుతో రేవంత్ హడావుడి చేస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలన్నారు.