Mallikarjun Kharge: ఖర్గే గారూ... తెలంగాణ ప్రభుత్వానికీ సలహా ఇవ్వండి: కేటీఆర్ సూచన
- ఇంటిని కూల్చి నిరాశ్రయులుగా చేయడం అమానవీయమని గతంలో ఖర్గే ట్వీట్
- తెలంగాణలో ఇప్పుడు అలానే జరుగుతోందంటూ కేటీఆర్ ట్వీట్
- రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలకాలంటూ ఖర్గేకు సూచన
ఖర్గే గారూ... మీరు చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా చేయడం అమానవీయం, అన్యాయం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో బుల్డోజర్ పాలనపై ఖర్గే చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం, అన్యాయం" అని ఖర్గే గతంలో ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ ప్రస్తావించారు.
తెలంగాణలోనూ చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం కనిపిస్తోందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో పేదలకు చెందిన 75 ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన ఈ నిరుపేదల్లో 25 కుటుంబాలు వికలాంగులవేనని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు.
సరైన విధివిధానాలు లేని చట్టం చట్టమే కాదన్నారు. దయచేసి తెలంగాణను ఈ దేశంలో మరో బుల్డోజర్ రాజ్యంగా మారకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వండని ఖర్గేకు సూచించారు.