Stock Market: సరికొత్త గరిష్ఠాలను తాకిన భారత స్టాక్ మార్కెట్

Sensex Nifty close at all time high before release of GDP numbers
  • జీడీపీ విడుదలకు ముందు అదరగొట్టిన సూచీలు
  • సెన్సెక్స్ 231 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు అప్
  • గ్లోబల్ మార్కెట్‌పై అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాల ప్రభావం
జీడీపీ డేటా విడుదలకు ముందు (సాయంత్రం జీడీపీ డేటా విడుదలైంది) భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈరోజు సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగిసి 82,365 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 25,235 వద్ద స్థిరపడింది. ఓ సమయంలో సెన్సెక్స్ 82,637, నిఫ్టీ 25,268 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. 

బీఎస్ఈలో 2,239 కంపెనీల షేర్లు లాభాల్లో... 1,687 కంపెనీల షేర్లు నష్టాల్లో, 119 కంపెనీల షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఫిన్ సర్వీస్, ఫార్మా, రియాల్టీ, మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్-30లో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, టీసీఎస్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, రిలయన్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, నెస్లే, మారుతి సుజుకీ టాప్ లూజర్లుగా నిలిచాయి.

సెప్టెంబర్‌‍లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గిస్తుందనే అంచనాలు గ్లోబల్ మార్కెట్‌కు ఊతమిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం భారత మార్కెట్ పైనా పడిందని, దీంతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, నిన్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.3,259 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,690 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. 

నిఫ్టీ ఇండెక్స్ 25,000 కంటే పైన ఉన్నంత వరకు మార్కెట్ బలం కొనసాగుతుందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ దే తెలిపారు. అంతకు దిగువకు వెళితే మాత్రం భారీ దిద్దుబాటు ఉండవచ్చునన్నారు. సెన్సెక్స్ 25,500 చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.
Stock Market
Share Market
Sensex

More Telugu News