AP Rains: బంగాళాఖాతంలో రాగల 36 గంటల్లో వాయుగుండం
- వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- అల్పపీడనం మరింత బలపడిందన్న ఐఎండీ
- ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో తెలిపింది.
దీని ప్రభావంతో ఏపీలో రేపు (ఆగస్టు 31), ఎల్లుండి (సెప్టెంబరు 1) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీని ఉటంకిస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వివరించింది. రేపు తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఎపీఎస్డీఎంఏ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.