AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
- వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలన్న సీఎం
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖలు ఫుల్ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలు పడుతున్న అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు.
భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలర్ట్ లు పంపించాలని చంద్రబాబు ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని... ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని... దీని ప్రభావంతో పెను వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు... మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.