Heavy Rains: హైదరాబాద్కు నేడు, రేపు భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
- జంట నగరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
- ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
- అత్యవసర సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్న ఐఎండీ
హైదరాబాద్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నేడు ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. రోడ్లు జలమయం అవుతాయని, చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలే అవకాశం ఉందని వివరించింది. విద్యుత్తు, తాగునీటి సరఫరాతోపాటు అత్యవసర సేవలకు కొన్ని గంటలపాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతాయని తెలిపింది.
కాగా, గత రాత్రి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ ఉదయం 8.30 గంటల సమయానికి హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాంతంలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బీహెచ్ఈఎల్లో 15.5 మిల్లీమీటర్లు, గచ్చిబౌలిలో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.