Landslide: విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య
- విజయవాడలో రెండ్రోజులుగా వర్షాలు
- మొగల్రాజపురంలో విరిగిపడిన కొండచరియలు
- మృతుల సంఖ్య పెరగడంపై సీఎం చంద్రబాబు విచారం
భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద ఈ ఉదయం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మిగా గుర్తించారు. మరో వ్యక్తి పేరు తెలియరాలేదు.
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండచరియలు విరిగి పడిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడగా, పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరగడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు.