Kaja Toll Gate: భారీ వర్షాల ఎఫెక్ట్... కాజ టోల్ గేట్ వద్ద ఫీజు వసూలు చేయకుండానే వాహనాలను పంపిస్తున్న సిబ్బంది
- బంగాళాఖాతంలో వాయుగుండం
- ఏపీలో భారీ వర్షాలు
- విజయవాడ ప్రాంతంలో కుండపోత
- కాజ టోల్ గేట్ వద్ద రోడ్డుపై భారీగా నీరు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, విజయవాడ, పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
కాగా, మంగళగిరి సమీపంలోని కాజ టోల్ గేట్ వద్ద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఇక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో, సిబ్బంది టోల్ గేట్ వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయకుండానే వాహనాలను పంపించి వేస్తున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో, పలు వాహనాలను సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. రోడ్లపైకి ఎవరూ రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద ప్రవాహం ధాటికి వాహనాలు సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.