AP Rains: ఏపీలో నేడు కుమ్మేసిన వానలు... జిల్లాకు రూ.3 కోట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు
- బంగాళాఖాతంలో వాయుగుండం
- గత రాత్రి నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంమీ వర్షపాతం నమోదు
- ఉన్నతాధికారులతో మరోసారి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండడంతో, గత రాత్రి నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో 17.8, మంగళగిరిలో 15.4, ఏలూరు జిల్లా నూజివీడులో 15, బాపట్ల జిల్లాలో 11, పల్నాడు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై సమీక్షిస్తున్నారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణ సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది చనిపోయినట్టు అధికారులు వివరించారు. బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నందున ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటనున్న నేపథ్యంలో, ఉత్తరాంధ్ర ప్రజలను అప్రమత్తం చేయాలని, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వాయుగుండం తీరం దాటేటప్పుడు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వాయుగుండం తీరం దాటే వేళ గాలులపై స్పష్టమైన అంచనాలతో ఉండాలని సీఎం చంద్రబాబు అధికార వర్గాలకు సూచించారు. వాయుగుండం వేగం, ప్రయాణ దిశకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని పేర్కొన్నారు.
వర్షాలు తగ్గే వరకు బయటికి రావొద్దని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో, ప్రజలు రేపు కూడా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
పట్టణాల్లో నీరు నిలిచిన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను పొక్లెయిన్లతో తొలగించాలని ఆదేశించారు. ఓపెన్ డ్రెయిన్లు ఉండే చోట హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేశారు.
వరద ప్రాంతాల్లో వాగులపై వాహనాలను అనుమతించవద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వంతెనలపై రాకపోకలు నిలిపివేయాలని సూచించారు.
కాగా, విజయవాడ రోడ్ల నుంచి నీటిని బయటకు పంపే చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని తెలిపారు.
తుపాను భవనాలు సిద్ధం చేసి ప్రజల పునరావాసానికి ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని చంద్రబాబు ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. హుద్ హుద్ తుపాను సమయంలో అమలు చేసిన విధానాలను అనుసరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.