Vangalapudi Anitha: భారీ వర్షాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష..కీలక ఆదేశాలు జారీ
- అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత
- రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి అనిత
- ఇకపై ఎలాంటి ప్రాణనష్టాలు సంభవించకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి
ఏపీలో భారీ వర్షాలపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అనిత.. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. తీరం వెంబటి గంటకు 45 నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఆదివారం చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇకపై ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లకు హోంమంత్రి సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలానే త్వరతగతిన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆర్ డబ్ల్యుఎస్, హెల్త్ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, పడిన చెట్లు వెంటనే తొలగించాలని సూచించారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకూ ప్రజలు బయటకు రాకూడదని, సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు.