Rains: పవర్ ప్లాంట్ లో చిక్కుకున్న ఆరుగురు సిబ్బందిని కాపాడిన పోలీసులు.. సూర్యాపేట జిల్లాలో ఘటన
- శనివారం రాత్రి గాయత్రి పవర్ ప్లాంట్ లోకి భారీగా వరద
- ఫోన్ చేసి పోలీసుల సాయం కోరిన సిబ్బంది
- జేసీబీ సాయంతో అందరినీ కాపాడిన పాలకవీడు ఎస్సై
భారీ వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో గాయత్రి పవర్ ప్లాంట్ లోకి వరద నీరు చేరింది. శనివారం రాత్రి ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ప్లాంట్ లో ఆరుగురు సిబ్బంది చిక్కుకుపోయారు. దీంతో సాయం కోసం వారు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన పాలకవీడు ఎస్సై లక్ష్మీ నరసయ్య జేసీబీ సాయంతో ఆరుగురిని కాపాడారు.
పాలకవీడు మండలంలోని వేములేరు వాగుపై ప్రభుత్వం గతంలో గాయత్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా శనివారం రాత్రి పవర్ ప్లాంట్లోకి వరద నీరు భారీగా చేరింది. ప్లాంట్ లో విధుల్లో ఉన్న ఆరుగురు సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. బయటకు వచ్చే వీలులేక సాయం కోసం పాలకవీడు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఎస్సై లక్ష్మీ నరసయ్య తన సిబ్బంది, జేసీబీతో తెల్లవారు జామున 3 గంటలకు పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి రెండు గంటల పాటు శ్రమించి పవర్ ప్లాంట్ సిబ్బంది ఆరుగురిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లను స్థానికులు అభినందించారు.