Chandrababu: చంద్రబాబు @ 30 .. సాధారణ రైతు కుటుంబం నుంచి అసాధారణ రాజకీయవేత్తగా.. స్పెషల్ స్టోరీ!

Special story on Chandrababu on completion of taking oath as CM for first time 30 years

  • చంద్రబాబు తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టి నేటికి 30 ఏళ్లు
  • 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్లకే మంత్రి పదవి
  • బాబుకు తన కూతురునిచ్చి పెళ్లి చేసిన ఎన్టీఆర్
  • 1983లో టీడీపీలో చేరిన చంద్రబాబు
  • జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర
  • ఒడిదుడుకులు ఎదురైన ప్రతిసారి తిరిగి నిలబడ్డ రాజకీయ దురంధరుడు

మన దేశ రాజకీయాల్లో ఆయనదొక చెరగని ముద్ర. దేశంలో ఎందరో రాజకీయ ఉద్ధండులు ఉన్నప్పటికీ... తనదైన ప్రత్యేకతతో, అసాధారణ ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆయన సృష్టించుకున్నారు. ఆయనే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సాటి ముఖ్యమంత్రుల ఆలోచనలకు కూడా అందని విధంగా ఆయన పాలనా విధానం ఉంటుంది. విభిన్నమైన ఆలోచనలతో, పక్కా ప్రణాళికతో అద్భుతమైన ఫలితాలను రాబట్టడం ఆయన నైజం. తన విజన్ కు టెక్నాలజీని జోడించి... యువత జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. మహిళలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. రాజకీయాల్లో ఒడుదుడుకులు ఎదురైన ప్రతిసారీ... తన అనుభవంతో, చతురతతో తిరిగి నిలబడ్డారు. 
 
రాజకీయాల్లో అవిశ్రాంత పోరాట యోధుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి పగ్గాలు చేపట్టి నేటికి 30 ఏళ్లు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 30 ఏళ్ల క్రితం సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వయసు పెరుగుతున్నా... ఆయనలో సత్తా మాత్రం తగ్గలేదు. ఆయన ఆలోచనల్లో పదును పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, పొలిటికల్ సీఈవో అంటూ అందరి చేత గొప్పగా పిలిపించుకోవడం కేవలం చంద్రబాబుకే సాధ్యం. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. మరెన్నో ఉత్థాన, పతనాలు. ఇప్పటికీ ఆయనలో అదే ఉత్సాహం, అదే వేగం, అదే ఆత్మవిశ్వాసం. ఏపీని నెంబర్ 1 చేయాలనేదే ఆయన పట్టుదల.  
 
ఇప్పటి వరకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు ఆయనదే. ఎక్కడో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిన్న గ్రామం నారావారిపల్లెలో 1950లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు... తన అసాధారణ నాయకత్వ లక్షణాలతో దేశ రాజకీయాల్లోనే తిరుగులేని నేతగా ఎదిగారు. 

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన చంద్రబాబు... 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో అతి తక్కువ వయసులో... 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్లకే మంత్రి అయిన ఘనత ఆయనది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడింది. 1981లో ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరితో చంద్రబాబు వివాహం జరిగింది. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఎన్టీఆర్ కోరికపై 1983లో చంద్రబాబు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం మొదలయింది.
 
1984లో టీడీపీ ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు... చంద్రబాబు పోషించిన పాత్ర అమోఘం. తన వ్యూహ రచనతో, రాజకీయ చతురతతో టీడీపీని సంక్షోభం నుంచి గట్టెక్కించారు. 1986లో చంద్రబాబును టీడీపీ జనరల్ సెక్రటరీగా ఎన్టీఆర్ నియమించారు. 1994లో టీడీపీ అధికారంలోకి రావడంలో కూడా బాబుదే ప్రధాన పాత్ర. ఆ తర్వాత పార్టీలో ఒక వ్యక్తి ప్రమేయం ఎక్కువయిపోవడంతో... 160 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ పై చంద్రబాబు అవిశ్వాసం ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ స్థానంలో 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. 
 
రెండు సార్లు ప్రధానమంత్రుల నియామకంలో చంద్రబాబుదే కీలక పాత్ర. భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను నియమించడంలో కూడా బాబు చక్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా ఐటీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారు. ఆయన కృషి వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గ్రామం నుంచి యువత విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడ్డారు. రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఏపీకి ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవో మాదిరి పని చేస్తున్నారంటూ ఎందరో ప్రముఖులు ఆయనను కొనియాడారు. 
 
1995 నుంచి 2004 మే వరకు దేశ రాజకీయాల్లో ఆయన ఒక వెలుగు వెలిగారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండు ఓటములు ఎదురైనా ఆయన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. పార్టీ శ్రేణుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపుతూనే వచ్చారు. టీడీపీని బలోపేతం చేయడం కోసం 208 రోజుల పాటు 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 

రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు. రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని తక్కువ కాలంలోనే గాడిలో పెట్టారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం పనులను పరుగులు పెట్టించారు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగభృతి, చేయూత, ఆదరణ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మళ్లించారు. 

2019లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ... రాష్ట్ర ప్రజల అండతో 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కేంద్ర రాజకీయాల్లో మళ్లీ కీలకపాత్ర పోషిస్తున్నారు. మోదీ 3.0 ప్రభుత్వంలో చంద్రబాబుదే కీలక భూమిక. 74 ఏళ్ల వయసులో సైతం నవ యువకులతో పోటీ పడే విధంగా ఆయన ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.

  • Loading...

More Telugu News