Man sits on road: యూపీలో నడి రోడ్డుపై కుర్చీవేసుకుని కూర్చున్న వ్యక్తి.. ఢీకొట్టి వెళ్లిపోయిన ట్రక్.. వీడియో ఇదిగో!
- కొద్దిలో తప్పిన ప్రాణాపాయం
- మతిస్థిమితం లేదన్న కుటుంబ సభ్యులు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఓవైపు జోరున వర్షం కురుస్తోంది.. రోడ్డుపై వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి కుర్చీ తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. నడి రోడ్డుపైకి వచ్చి అక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అక్కడ ఉన్న వారితో పాటు వాహనదారులు లెమ్మని అరుస్తున్నా కిమ్మనకుండా కూర్చునే ఉన్నాడు. ఇంతలో దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఆ వ్యక్తిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. యూపీలోని కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ మనిషిని ఢీకొట్టిన తర్వాత కూడా ఆపకుండా వెళ్లిపోయిన ట్రక్ డ్రైవర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ చెక్పోస్ట్కి దగ్గర్లోనే ఈ ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆ ట్రక్ ను గుర్తించామని, డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇక నడి రోడ్డుపై కుర్చీ వేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతనలేని సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారని వివరించారు.