Heavy Rains: భారీ వర్షాలకు తెలంగాణలో 15 మంది మృతి.. జనజీవనం అస్తవ్యస్తం
- మరో ఐదుగురి ఆచూకీ గల్లంతు
- ఖమ్మం జిల్లాలో జలదిగ్బంధంలో 100కుపైగా గ్రామాలు
- మహబూబాబాద్, సూర్యాపేటలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
- రైళ్లు, బస్సు సేవలకు అంతరాయం
ఆకాశానికి చిల్లు పడినట్టు ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో 15 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 100కుపైగా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. మున్నేరు పోటెత్తడంతో ఖమ్మంలో 10 అడుగుల మేర వరద ముంచెత్తింది. నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రెండుచోట్ల, సూర్యాపేటలో ఒకచోట రైల్వే ట్రాక్ కోతకు గురికావడంతో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు మూడుచోట్ల గండ్లు పడ్డాయి. భక్త రామదాసు పంపుహౌస్ మునిగిపోయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వరదనీరు చేరడంతో కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కోదాడలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఈసా, మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి.
సబ్ స్టేషన్లలోకి నీరు చేరడం, చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేల కూలడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా 218 రూట్లలో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.