Mithun Reddy: ఫైల్స్ అన్నీ ఆన్ లైన్ లో ఉన్నా.. మాపై తప్పుడు ప్రచారం చేశారు: మిథున్ రెడ్డి
- మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో తమపై దుష్ప్రచారం చేశారన్న మిథున్ రెడ్డి
- వరద సహాయక చర్యలకు హెలికాప్టర్లు ఎందుకు పంపించలేదని ప్రశ్న
- సూపర్ సిక్స్ అనే మాటనే మర్చిపోయారని విమర్శ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ని ఫైళ్లను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఈ ఘటనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై ఈరోజు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఫైల్స్ అన్నీ ఆన్ లైన్ లో ఉన్నా మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. హెలికాప్టర్ లో డీజీపీని మదనపల్లికి పంపించారని... ఇప్పుడు వరద సహాయక చర్యలకు హెలికాప్టర్లను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు.
పార్టీ మారాలంటూ వైసీపీ మున్సిపల్ ఛైర్మన్లను, కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలను మానుకుని... అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. సూపర్ సిక్స్ అనే మాటను టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మర్చిపోయారని చెప్పారు.