Hyderabad: ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
- భారీ వర్షాలతో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య
- ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసుల ఆదేశాలు
- వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందంటున్న పోలీసులు
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ లోని అన్ని ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తే అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తదని వారు తెలిపారు. ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించాలని అన్ని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ లేఖ రాశారు.
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. వర్షం పడిన సమయాల్లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. పనివేళలు ముగిసే సమయానికి రద్దీ ఇంకా ఎక్కువవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే రద్దీ తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి, సహాయక శిబిరాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు ఆదేశించారు.