Chandrababu: అధికారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
- వరద సహాయక చర్యలపై చంద్రబాబు సమీక్ష
- అలసత్వాన్ని వదిలించుకోవాలని అధికారులకు చంద్రబాబు హెచ్చరిక
- ఆహారం పంపిణీలో జాప్యంపై మండిపాటు
వరద సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అలవాటైన అలసత్వాన్ని వదిలించుకోవాలని... లేకపోతే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
అధికారుల తీరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా ఉండాలని హితవు పలికారు. వరద సహాయక చర్యల్లో తానే స్వయంగా రంగంలోకి దిగానని... అయినా అధికారులు మొద్దు నిద్ర వీడకపోతే ఎలాగని ప్రశ్నించారు. కావాల్సినంత ఆహారాన్ని తెప్పించినా... దాన్ని పంపిణీ చేయడంలో జరిగిన జాప్యంపై మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఓ మంత్రి మాట్లాడుతూ... ఆనాడు జగన్ భక్తులుగా ముద్రపడిన అధికారులు ఉన్నచోట సమస్య అధికంగా ఉందని చెప్పారు. పంపిణీ సక్రమంగా జరగకుండా ఆ అధికారులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
దీంతో చంద్రబాబు స్పందిస్తూ... పని చేయడం ఇష్టం లేని అధికారులు ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్లిపోవాలని అన్నారు. ప్రజలు సమస్యల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు.