Harbhajan Singh: అది నిన్ను నువ్వు అవమానించుకోవడమే అవుతుందని కోహ్లీతో అప్పుడే చెప్పా: హర్భజన్‌సింగ్
- కోహ్లీ అరంగేట్ర మ్యాచ్‌లకు సంబంధించి రెండు ఘటనలు గుర్తు చేసుకున్న హర్భజన్
- అతడు గొప్ప ఆటగాడు అవుతాడని అప్పుడే ఊహించానన్న మాజీ స్పిన్నర్
- ఒకానొక సమయంలో టెస్టులో తాను ఆడగలనా? అని భయపడ్డాడన్న భజ్జీ
- టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించకుంటే అది నీకే అవమానమని అన్నానని గుర్తు చేసుకున్న హర్భజన్
రికార్డులున్నవి బద్దలు కావడానికేనని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అనేవాడు. తన రికార్డులు కూడా ఏదో ఒకనాడు బద్దలవుతాయని, కాకపోతే అవి భారతీయుడి చేతిలో కావాలన్నదే తన అభిమతమని పలుమార్లు చెప్పుకొచ్చాడు. కోహ్లీ, రోహిత్శర్మలలో ఎవరో ఒకరు ఆ పని చేస్తాడని విశ్వసించేవాడు. అయితే, సరిగ్గా దశాబ్దం తర్వాత సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. సచిన్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లీ చేరువలో ఉన్నాడు.
కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడని తనకు తెలుసని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్‌సింగ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ అరంగేట్ర సిరీస్‌లోని ఓ ఘటనను భజ్జీ గుర్తు చేసుకున్నాడు. 2008 శ్రీలంక పర్యటనలో కోహ్లీ అరంగేట్రం చేశాడు. ఐదో వన్డేలో సవాలుతో కూడిన పిచ్‌పై అర్ధ సెంచరీ సాధించడానికి ముందు అతడు వరుసగా 12, 37, 25 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ బౌలింగ్ ను ఆడేందుకు స్టార్ ఆటగాళ్లు భయపడితే కోహ్లీ మాత్రం మెండిస్ రహస్యాన్ని డీకోడ్ చేసి చెడుగుడు ఆడుకున్నాడని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు.
అలాగే, వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లీని ఫిడెల్ ఎడ్వర్డ్స్ భయపెట్టాడు. ఆ సమయంలో తను టెస్టు క్రికెట్ ఆడగలనా? అని భయపడ్డాడని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తాను కోహ్లీకి ఒకటే చెప్పానని, టెస్టు క్రికెట్లో నువ్వు 10 వేల పరుగులు సాధించకుంటే అది నిన్ను నువ్వు అవమానించుకోవడమే అవుతుందని చెప్పానని హర్భజన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
కోహ్లీ టెస్టుల్లో ఇప్పటి వరకు 8,848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 254 పరుగులు. ఇక, వన్డేల్లో 13,906 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 183 పరుగులు. టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్లో కలిపి ఇప్పటి వరకు కోహ్లీ ఖాతాలో 88 సెంచరీలున్నాయి.