Pawan Kalyan: దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- విజయవాడ వరదలపై హోంమంత్రి అనితతో కలిసి పవన్ సమీక్ష
- మరో 12 వేల క్యూసెక్కులు వచ్చి ఉంటే అనూహ్య ప్రమాదం జరిగేదని వెల్లడి
- ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా పక్కా ప్రణాళిక రూపొందిస్తామని వివరణ
విజయవాడ వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీరు వల్లే ఇప్పుడీ వరదలు, ఇబ్బందులు వచ్చాయని అన్నారు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. ఇంకో 12 వేల క్యూసెక్కుల వరద వచ్చి ఉంటే ఊహించినంత ప్రమాదం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలోనూ భారీ వర్షాలు పడడం, అక్కడ్నించి నీరు ఏపీ వైపుకు రావడం వల్ల వరద పరిస్థితులు తలెత్తాయని పవన్ వివరించారు. విజయవాడ ఇంత తీవ్రంగా నష్టపోవడానికి కారణం... గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడమేనని అన్నారు.
ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. ప్రాజెక్టుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో చిన్న చిన్న లాక్ లను కూడా విస్మరించారని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం రేయింబవళ్లు సహాయక చర్యల్లో నిమగ్నమైందని, చిన్నపాటి ప్రాంతానికి కూడా ఒక ఐఏఎస్ అధికారిని నియమించి సహాయక చర్యలను ముందుకు తీసుకెళుతున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇది ఎవరి తప్పు అని చర్చించడం కంటే, ఎంతమందికి ఇప్పుడు సహాయపడగలం అనే అంశానికే తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
విజయవాడలో వరద నీరు తగ్గగానే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఏంచేయాలో పక్కా ప్రణాళికతో ముందుకెళతామని వివరించారు. అవుట్ లెట్ కాలువలు, వరద కాలువల నిర్మాణంపై దృష్టిసారిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబుతో ఈ విషయంపై చర్చిస్తామని పవన్ వెల్లడించారు.
అంతకుముందు, అమరావతిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వరదకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను పవన్ కల్యాణ్ తిలకించారు.