IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్స్... 22 మందికి రూ.1 కోటికి పైగా ప్యాకేజీ ఆఫర్

IIT Bombay minimum salary package drops to Rs 4 lakh during placement

  • 1650 మందికి ఉద్యోగాలను ఆఫర్ చేసిన 364 కంపెనీలు
  • ఆఫర్లను అంగీకరించిన 1475 మంది దరఖాస్తుదారులు
  • రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆఫర్‌ను అంగీకరించిన 10 మంది

ఐఐటీ బాంబేలో ప్లేస్‌మెంట్స్-2024 ముగిశాయి. 123 కంపెనీల నుంచి 558 మందికి జాబ్ ఆఫర్లు రాగా, వీరికి రూ.20 లక్షలు, ఆ పైన ప్యాకేజీ లభించింది. మరో 230 మందికి రూ.16.75 లక్షల నుంచి రూ.20 లక్షల ప్యాకేజీ లభించింది. 22 మంది విద్యార్థులు రూ.1 కోటి, అంతకుమించి వార్షిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలకు అంగీకరించారు. 78 మంది విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు పొందారు.

సగటు వార్షిక ప్యాకేజీ రూ.23.50 లక్షలతో గత ఏడాది కంటే (రూ.21.8 లక్షలు) స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ ఆఫర్లలో ఏడాదికి రూ.4 లక్షల కంటే తక్కువ వేతనం కూడా ఉండటం పరిశ్రమకు ఆందోళన కలిగించే అంశం. 10 మంది విద్యార్థులు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు జాబ్ ఆఫర్‌కు అంగీకారం తెలిపినట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది.

సగటున ప్యాకేజీ 7.7 శాతం పెరిగినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే క్యాంపస్ డ్రైవ్‌లో తక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకున్నట్లు ప్రీమియర్ ఇనిస్టిట్యూట్ నివేదిక వెల్లడించింది.

దాదాపు 364 కంపెనీలు 1,650 ఉద్యోగాలను ఆఫర్ చేయగా, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలోనే భారీగా ఆఫర్లు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోసం మొత్తం 2,414 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 1,979 మంది ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనగా... 1,475 మంది ఆఫర్లను అంగీకరించినట్లు ఐఐటీ బాంబే తెలిపింది.

  • Loading...

More Telugu News