Kangana Ranaut: కంగనా రనౌత్ కు షాకిచ్చిన బాంబే హైకోర్టు
- ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా 'ఎమర్జెన్సీ' సినిమా
- సినిమాను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ కూడా సెన్సార్ బోర్డుకు లేఖ
- 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన బాంబే హైకోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె స్వయంగా దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన 'ఎమర్జెన్సీ' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్ర సెన్సార్ బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెప్టెంబర్ 18వ తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా 'ఎమర్జెన్సీ' సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రంలో ఇందిర పాత్రను కంగన పోషించారు. మహిమా చౌదరి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా ఈ నెల 6న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమాలో తమను తక్కువగా చూపించారంటూ ఓ వర్గం మధ్యప్రదేశ్ లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సదరు కోర్టు సూచించింది. రాజకీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ కూడా ఈ సినిమా విడుదల ఆపేయాలని సెన్సార్ బోర్డును కోరింది. వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాన్ని పెంపొందించేలా సినిమా ఉందని సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టును కంగన ఆశ్రయించారు. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.