Alleti Maheshwar Reddy: మజ్లిస్ పార్టీ ఆనందం కోసమే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించడం లేదా?: బీజేపీ ప్రశ్న

BJP LP Maheshwar Reddy questions about Sep 17

  • సెప్టెంబర్ 17 తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వెల్లడి
  • సెప్టెంబర్ 17 కచ్చితంగా విమోచన దినమేనని వ్యాఖ్య
  • గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శ

మజ్లిస్ పార్టీ ఆనందం కోసమే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదా? అని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి సెప్టెంబర్ 17 ప్రతీక అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. 

స్వాతంత్ర్య దినోత్సవంగా, విమోచన దినంగా ఎందుకు జరపడం లేదో చెప్పాలన్నారు. అసలు అధికారికంగా నిర్వహించాలనే ఆలోచనే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికీ లేదని విమర్శించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా దీనిని నిర్వహిస్తోందని గుర్తించాలన్నారు. నిజాం పాలనలో ఎంతోమంది ఇబ్బందిపడ్డారని, చరిత్రను కప్పిపుచ్చడానికే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజనకు ముందు విమోచన దినం ఎందుకు జరపడం లేదని సమైక్య పాలకులను కేసీఆర్ ప్రశ్నించారని, ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం పక్కన పెట్టారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 కచ్చితంగా విమోచన దినమే అన్నారు. ఇది ఏ మతానికో... కులానికో వ్యతిరేకం కాదన్నారు. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకమన్నారు. భారీ వర్షాల అంశంపై కూడా ఆయన మాట్లాడారు.

భారీ వర్షాలతో తెలంగాణలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షలు ప్రకటించిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. రెండు కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News