USA: ఉక్రెయిన్-రష్యా వివాదం పరిష్కారానికి సిద్ధంగా ఉన్న ఏ దేశాన్నైనా స్వాగతిస్తాం: అమెరికా
- ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన
- ఉక్రెయిన్ ప్రజల హక్కులకు అనుగుణంగా పనిచేయాలని పిలుపు
- ఇటీవలే మోదీతో ఫోన్లో మాట్లాడిన అధ్యక్షుడు బైడెన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీతో అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడారు కదా? అని మీడియా ప్రశ్నించగా కిర్బీ ఈ సమాధానం ఇచ్చారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో చారిత్రాత్మక పర్యటన చేశారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రష్యాతో వివాదం ముగింపునకు భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా మోదీ ఉక్రెయిన్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు.