Tinder leave: ఈ థాయ్ కంపెనీ సమ్‌థింగ్ స్పెషల్ గురూ.. డేట్‌లకు వెళ్లడానికి ఉద్యోగులకు చెల్లింపులతో కూడిన సెలవులు!
- వైట్‌లైన్ గ్రూప్‌లో ఉద్యోగులకు పెయిడ్ 'టిండర్ లీవ్'
- ఉద్యోగుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయమన్న మార్కెటింగ్ ఏజెన్సీ
- ఈ వినూత్న నిర్ణయంతో నెట్టింట వైరల్ అవుతున్న మార్కెటింగ్ ఏజెన్సీ
థాయ్‌లాండ్‌లోని మార్కెటింగ్ ఏజెన్సీ వైట్‌లైన్ గ్రూప్ తన ఉద్యోగుల కోసం కొత్త ప్రయోజనాన్ని ప్రకటించి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. డేట్‌లకు వెళ్లడానికి ఉద్యోగులకు చెల్లింపులతో కూడిన సెలవులు ఇస్తామని సంస్థ ప్రకటించింది.
'టిండర్ లీవ్' పేరిట ఇస్తున్న ఈ సెలవులను ఉద్యోగులు జులై నుండి డిసెంబరు వరకు ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు. ఉద్యోగుల శ్రేయస్సు కోసమే ఈ కొత్త ప్రయోజనాన్ని చేకూరుస్తున్నట్లు మార్కెటింగ్ ఏజెన్సీ పేర్కొంది. అయితే, టిండర్ లీవ్‌కు ఎన్ని రోజులు కేటాయించారనేది మాత్రం సంస్థ పేర్కొనలేదు.
ఇక తమ ఈ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఉద్యోగులు తప్పనిసరిగా ఒక వారం ముందుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వైట్‌లైన్ గ్రూప్ వెల్లడించినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
"మా ఉద్యోగులు ఎవరితోనైనా డేటింగ్ కోసం టిండర్ సెలవును ఉపయోగించవచ్చు" అని వైట్‌లైన్ గ్రూప్ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది.
కాగా, తమ సిబ్బందిలో ఒకరు చాలాసార్లు డేటింగ్‌లో బిజీ అంటూ తరచూ సెలవులు పెట్టడంతో వైట్‌లైన్ గ్రూప్ ఈ టిండర్ లీవ్‌ను తీసుకువచ్చినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
మార్కెటింగ్ ఏజెన్సీ నిర్వాహకులు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అక్కడి ఉద్యోగుల పనిని మరింత ఆనందదాయకంగా మారుస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
.