Wolf Terror: బహ్రయిచ్లో తోడేళ్ల విధ్వంసం.. మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయంటున్న అటవీ అధికారి!
- ఇప్పటికే 10 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన తోడేళ్లు
- మరెంతో మందికి గాయాలు
- వాటి నివాసాలు, పిల్లలకు హాని జరగడం వల్లేనన్న అటవీ అధికారి
- వాటికి స్వతహాగా ప్రతీకారం తీర్చుకునే లక్షణం ఉంటుందన్న వైనం
- వరదల కారణంగా ధ్వంసమైన తోడేళ్ల డెన్
ఉత్తరప్రదేశ్లోని బహ్రయిచ్లో తోడేళ్ల విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే 10 మందిని అవి పొట్టనపెట్టుకున్నాయి. మరెంతోమందిని గాయపరిచాయి. అవి కనిపిస్తే కాల్చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. షార్ప్ షూటర్లను కూడా నియమించింది. అయితే, అవి ఎందుకలా ఊర్ల మీద పడి చిన్నారులను చంపుకు తింటున్నాయన్న దానిపై అటవీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్టు చెప్పారు.
తోడేళ్ల నివాసాలకు కానీ, వాటి పిల్లలకు కానీ హాని జరిగితే ఊరుకోవని, ప్రతీకారం తీర్చుకునే అలవాటు వాటి సొంతమని యూపీ ఫారెస్ట్ కార్పొరేషన్ సీనియర్ అధికారి సంజయ్ పాఠక్ తెలిపారు. నిజానికి జంతువులు చాలా సున్నితంగా ఉంటాయని, వాటికి హాని జరగడంతోనే అవి ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిపారు.
‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలకు కానీ, పిల్లలకు కానీ హాని జరిగితే అవి సహించవు. అవి మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటాయి’ అని పేర్కొన్నారు. బహ్రయిచ్ విషయంలో ఈ కోణాన్ని కొట్టిపడేయలేమని ఆయన తెలిపారు.
బహ్రయిచ్లోని రాంపూర్ గ్రామస్థులు కూడా తోడేళ్ల నివాసాల్లో పిల్లలను చూసినట్టు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఘఘరా నది ఉప్పొంగి తోడేళ్ల ఆరు అడుగుల పొడవైన డెన్ (నివాసం)ను ముంచెత్తింది. ఆ కారణంగా తోడేళ్ల పిల్లలు చనిపోయి ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు తోడేళ్లు తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్లో తోడేళ్లు ఇలా చెలరేగి రక్తపాతం సృష్టించడం ఇదే తొలిసారి కాదు. 1996లో ప్రతాప్గఢ్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పదిమందికిపైగా చిన్నారులపై తోడేళ్లు దాడిచేశాయి. ఆ తర్వాత గ్రామ సమీపంలో గ్రామస్థులు తోడేళ్ల పిల్లల కళేబరాలను గుర్తించారు.