Perni Nani: వైసీపీ నేతల అరెస్ట్ లపై పేర్ని నాని స్పందన
- గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి
- నందిగం సురేశ్, శ్రీనివాసరెడ్డిల అరెస్ట్
- జైల్లో తమ సహచర నేతలను కలిసిన పేర్ని నాని బృందం
- ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారన్న పేర్ని నాని
- ఐదేళ్ల తర్వాత కూటమి మాడు పగులగొడతారని వ్యాఖ్యలు
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వైసీపీ నేతలు నందిగం సురేశ్ తదితరులను అరెస్ట్ చేయడం తెలిసిందే. వైసీపీ నేతల అరెస్ట్ లపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిలను అక్రమ కేసులో అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. వారిని ఇవాళ విజయవాడ జైల్లో పరామర్శించామని వెల్లడించారు. వైసీపీలో రాజకీయంగా చురుగ్గా, ఉత్సాహంగా వ్యవహరిస్తున్న నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అన్నారు.
వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి నాయకుడిని ఏదో ఒక తప్పుడు కేసు బనాయించి జైల్లో పెడుతోందని మండిపడ్డారు. తద్వారా వైసీపీ నేతలను మానసికంగా కుంగదీసి, వారిని అనుసరించే కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే కూటమి ప్రణాళిక అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు.
"టీడీపీ ఆఫీసుపై దాడి చేశారంట. టీడీపీ ఆఫీసులో బాత్రూంల వద్ద కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటున్నారు. పోలీసుల వద్ద ఫుటేజి ఉందని చెబుతున్నారు. కానీ, ఆ వీడియోల్లో నందిగం సురేశ్ కానీ, శ్రీనివాసరెడ్డి కానీ ఎవరూ లేరు. కనీసం వారు టీడీపీ ఆఫీసు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న వారిని గుర్తించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజిలో లేకపోయినా టీడీపీ కార్యకర్తలు చెప్పే దొంగ సాక్ష్యాలతో మా వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ విధంగా అరెస్ట్ చేసిన వారి స్కోరు 171కి చేరింది.
ఇలాంటి అరెస్టులతో వైసీపీని కుంగదీయాలనుకోవడం వీళ్ల అపోహ మాత్రమే. వీళ్ల ఆశలు అడియాసలవడం తప్పితే, మరేమీ జరగదు. గుంటూరు, కృష్ణా జిల్లాలే కాదు... మరే జిల్లాలో అయినా అక్రమ అరెస్టులతో జైళ్లన్నీ నింపినా, వైసీపీ సభ్యత్వం ఉన్నవాళ్లందరినీ లోపలేసినా కూడా... జగన్ నాయకత్వంలో వైసీపీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది.
జైల్లో ఎన్నాళ్లు ఉంచుకుంటారు?... బెయిల్ లభిస్తే బయటికి వస్తారు కదా! లేకపోతే పాత కేసులన్నీ తవ్వి, బెయిల్ వచ్చినా మళ్లీ తీసుకెళ్లి లోపల పెడతారు... ఆ విధంగా అయినా ఎన్నాళ్లు లోపల పెడతారు? ఐదేళ్లూ జైల్లో ఉంచలేరు కదా!
ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ఇలా వైసీపీని నిర్వీర్యం చేయాలని చూస్తే ఐదేళ్ల తర్వాత ప్రజలు మీ మాడు పగులగొట్టడం ఖాయం" అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.