Chandrababu: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు సాయం అన్నది పుకారు మాత్రమే: సీఎం చంద్రబాబు
- కేంద్రం ఏపీ, తెలంగాణలకు వరద సాయం ప్రకటించినట్టు వార్తలు
- కేంద్రం సాయంపై తమకేమీ సమాచారం లేదన్న చంద్రబాబు
- తాము ఇంకా కేంద్రానికి నివేదికే పంపలేదని స్పష్టీకరణ
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్ల వరద సాయం ప్రకటించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం సాయంపై తమకు ఇంకా సమాచారమేమీ రాలేదని వెల్లడించారు. ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్ల వరద సాయం ప్రకటించారన్నది పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.
కేంద్రానికి తాము ఇంకా వర్షాలు, వరదలు, పంట నష్టాలపై ప్రాథమిక నివేదికనే పంపలేదని తెలిపారు. నష్టం తాలూకు అంచనాలతో కూడిన ప్రాథమిక నివేదికను రేపు (సెప్టెంబరు 7) ఉదయం పంపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
గతంలో ఎన్నడూ లేనంతగా 11.90 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని... 28 మంది చనిపోయారని వివరించారు. సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద సాయం చేయాలని అందరినీ కోరుతున్నామని చెప్పారు. అనేకమంది వచ్చి బాధితులకు సాయం చేస్తున్నారని, ఇలాంటి కష్ట సమయంలో అందరూ ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరుతున్నానని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇళ్లు కోల్పోయిన వారికి ఎంత సాయం చేయగలమో ఆలోచిస్తున్నామని తెలిపారు. బాధితులకు సాయంపై కేంద్రంతోనూ, బ్యాంకర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. బీమా పాలసీలు ఉన్నవారిని త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని చెప్పారు.
ఇక, రేపు వినాయకచవితి పూజను విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకుంటున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. వినాయక పూజ చేసుకుంటూనే సహాయక చర్యలు కొనసాగిస్తామని అన్నారు.