Bhuma Akhila Priya: తన వద్ద కూడా ఒక 'రెడ్ బుక్' ఉందంటున్న టీడీపీ మహిళా నేత
- తన 'రెడ్ బుక్'లో వంద మందికి పైగా పేర్లు ఉన్నాయన్న భూమా అఖిలప్రియ
- ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరికలు
ఏపీ రాజకీయాల్లో గత కొంత కాలంగా రెడ్ బుక్ అంశం హాట్ టాపిక్‌గా ఉంది. మంత్రి నారా లోకేశ్ 'రెడ్ బుక్'లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే అంశం కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటి వరకూ 'రెడ్ బుక్' అంటే .. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించి, టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టిన అధికారుల పేర్లు లోకేశ్ 'రెడ్ బుక్'లో రాసుకొన్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా తన వద్ద 'రెడ్ బుక్' ఉందని కామెంట్స్ చేయడం తీవ్ర సంచలనమైంది.
అఖిలప్రియ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన వద్ద 'రెడ్ బుక్' ఉందని, ఇందులో వంద మందికిపైగా పేర్లు ఉన్నాయని అన్నారు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 'రెడ్ బుక్'లో పేరు ఉందని అంటే వారిని తాను ఏదో కట్టె పట్టుకుని కొడతా అని కాదని.. చంపేస్తాననీ కాదని అన్నారు. కచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ తెలిపారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిపై తప్పుడు కేసులు బనాయించారని, అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని చెప్పానా? అని ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే తోలు తీస్తానని హెచ్చరించానని, అదే తరహాలో ఉంటానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెబుతానని అన్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం అఖిలప్రియ 'రెడ్ బుక్' వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఖిలప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు నియోజకవర్గ అధికారుల్లో, ప్రతిపక్ష నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.