Babar Azam: బాబర్ ఆజామ్‌కు షాక్‌.. పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌​ ఎవరంటే?

Babar Azam to be sacked as Pakistan white ball captain says Report

  • ఇటీవ‌ల పాకిస్థాన్ జ‌ట్టుకు అన్ని ఫార్మాట్ల‌లో వ‌రుస వైఫ‌ల్యాలు
  • అటు ఆట‌గాడిగా, ఇటు కెప్టెన్‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్న బాబ‌ర్ ఆజామ్‌
  • ఈ నేప‌థ్యంలోనే కెప్టెన్సీ నుంచి బాబ‌ర్‌ను త‌ప్పించాల‌నే యోచ‌న‌లో పీసీబీ
  • స్టార్ ఆట‌గాడు మహ్మద్ రిజ్వాన్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు ఇచ్చే యోచ‌న‌

గ‌త కొంత‌కాలంగా పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు అన్ని ఫార్మాట్ల‌లో వ‌రుస వైఫ‌ల్యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అనామ‌క జ‌ట్లు సైతం దాయాది దేశంపై అలవొక విజయాలు సాధిస్తున్న వైనం. దీంతో పాక్ జ‌ట్టుపై అభిమానులు, మాజీలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయడానికి పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి సిద్ధమైనట్లు స‌మాచారం. ప్రస్తుత వైట్ బాల్ సార‌థి బాబర్ ఆజామ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. వైట్ బాల్ జట్ల కెప్టెన్ బాబర్‌కు ఉద్వాసన ప‌లికే అవకాశం ఉందని జియో న్యూస్ వెల్ల‌డించింది. 

టీ20, వన్డేలకు కొత్త సార‌థిని నియ‌మించాలని పీసీబీ అనుకుంటోందట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సొంత గ‌డ్డ‌పై జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగా జట్టును పటిష్టంగా చేయాలని ప్రణాళికలు రచిస్తోందని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి. 

అటు వ్య‌క్తిగ‌తంగానూ బాబ‌ర్ ఇంత‌కుముందులా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌లేపోతున్నాడు. ఇటీవ‌ల బంగ్లాతో సిరీస్ లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. అలాగే వైట్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్సీతో ప్ర‌భావితం చేయ‌లేక‌పోతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే అత‌డిని సారథ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని పీసీబీ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.  

జులైలో వైట్ బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, పీసీబీ అధికారుల మధ్య ఈ మేర‌కు చర్చలు జ‌రిగిన‌ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ కెప్టెన్‌గా రిజ్వాన్ క‌నిపించ‌డం ఖాయం. అంతేగాక ఆ జ‌ట్టు మూడు ఫార్మాట్లలో అత‌నే నాయకత్వం వహించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం షాన్ మసూద్ పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే, ఇటీవ‌ల స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఘోర ప‌రాజ‌యం అత‌ని కెప్టెన్సీపై వేటుకు కార‌ణం కావొచ్చ‌ని క్రీడా విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందుకే టెస్టు ఫార్మాట్‌లో కూడా రిజ్వాన్‌కే సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్కే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. 
 
ఇక వాస్తవానికి గతేడాది భార‌త్ వేదిక‌గా జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఆజామ్ అన్ని ఫార్మాట్ల సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కానీ, ఈ ఏడాది జ‌రిగిన‌ టీ20 ప్రపంచ కప్ ముందు బాబర్‌కు తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో జట్టు పగ్గాలను అందించింది పీసీబీ.

  • Loading...

More Telugu News