TGSRTC: పాప్యులారిటీ కోసం ఇలాంటి సోయిలేని పనులు చేయకండి.. సజ్జనార్ ఫైర్!
- సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం యువకుడి వింత చేష్టలు
- ఆర్టీసీ బస్సును ఆపి, ఎక్కకుండా అక్కడి నుంచి పరారైన యువకుడు
- తన స్నేహితులు ఇచ్చిన ఛాలెంజ్ కోసం యువకుడి సోయిలేని పని
- దీనిపై 'ఎక్స్' వేదికగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మండిపాటు
ఇటీవల కొందరు సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం వింత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వెర్రి పనులు చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అది కూడా తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన వీడియో కావడంతో దీనిపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
వీడియోలో ఓ యువకుడు ఆర్టీసీ బస్సును ఆపి, ఆ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం ఉంది. తన స్నేహితులు ఇచ్చిన ఛాలెంజ్ కోసం ఆ యువకుడు ఇలా చేయడం వీడియో చూస్తే అర్థమవుతోంది. దీనిపై సజ్జనార్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? అని ఫైర్ అయ్యారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారంటూ మండిపడ్డారు.
లైక్లు, కామెంట్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని సూచించారు. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సజ్జనార్ హితవు పలికారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ యువకుడిని నెటిజన్లు ఇలాంటి పనులేంటి అని చురకలంటిస్తున్నారు.