Arvind Kejriwal: లిక్కర్ పాలసీ ద్వారా పార్టీకి ప్రయోజనం చేకూరాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు: సీబీఐ
- మద్యం పాలసీ కేసులో ముగిసిన సీబీఐ దర్యాఫ్తు
- నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అన్న సీబీఐ
- ఆదాయాన్ని హవాలా మార్గంలో తరలించినట్లు వెల్లడి
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందని, కొత్త మద్యం విధానం ద్వారా తమ పార్టీకి ప్రయోజనం చేకూరాలని ఆయన డిమాండ్ చేశారని సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాఫ్తు ముగిసింది. ఛార్జిషీట్‌లో కీలక విషయాలను వెల్లడించింది.
ఎక్సైజ్ పాలసీని రూపొందించడం మొదలు, అమలు చేయాలనే అంశం వరకు జరిగిన నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని అందులో పేర్కొంది. ప్రతి అంశంలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్లు తెలిపింది.
తమ పార్టీకి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంలో భాగంగానే ఈ పాలసీని రూపొందించారని, అందుకే కేజ్రీవాల్ సన్నిహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్ నాయర్ పలువురు వాటాదారులను కలిసినట్లు సీబీఐ తన చార్జిషీట్ లో తెలిపింది. వారు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది.
మద్యం పాలసీ కుంభకోణం ద్వారా ఆర్జించిన మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించినట్లు తెలిపింది. మరో ఇద్దరు నిందితులు వినోద్ చౌహాన్, ఆశిష్ మాధుర్ ద్వారా అక్రమంగా తరలించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది.
కేజ్రీవాల్ ఆదేశాల మేరకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ధనాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించినట్లు పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు వివరించింది.
కాగా, ఈ చార్జిషీట్ దాఖలుతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసినట్టయింది.