Low Pressure: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... కోస్తా జిల్లాలకు వర్ష సూచన
- వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
- బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు పయనం
- ఈ నెల 9 నాటికి వాయుగుండంగా మారే అవకాశం
వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు పయనిస్తుందని, ఎల్లుండి (సెప్టెంబరు 9) నాటికి వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.