HYDRA: సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆక్రోశం.. వైరల్ వీడియో
- కోర్టుకు వెళ్లాం.. అయినా కూల్చివేస్తున్నారంటూ మహిళ కన్నీళ్లు
- కూల్చివేతలు జరిగే చోట ఉద్రిక్తత
- బాధితులను దూరంగా పంపిస్తున్న పోలీసులు
హైదరాబాద్ లోని మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. బహుళ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు కూల్చివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అక్కడున్న బాధితులు మీడియా ముందు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. కూల్చివేతలు జరుగుతున్న చోట ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడున్న వారిని పోలీసులు దూరంగా పంపించారు. ఓ మహిళ కన్నీళ్ల మధ్య హైడ్రా అధికారులను, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వంపై, సీఎంపై శాపనార్థాలు పెట్టింది. తమ కట్టడాలు అక్రమమంటూ నోటీసులు ఇవ్వడంతో తాము కోర్టుకు వెళ్లామని మీడియా ముందు వెల్లడించింది. అయినా ఆగకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేస్తే కోర్టులు ఉన్నది ఎందుకు..? మేం కోర్టుకు వెళ్లడం ఎందుకు? అని ప్రశ్నించింది.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగుడుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడింది. ఆ మహానుభావుడు (కేసీఆర్ ను ఉద్దేశించి) 28 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని గుర్తుచేసింది. ‘ఏం బాబూ నువ్వు ఎందుకు వచ్చావు. మా కడుపులు కొట్టడానికి వచ్చావా? కేసీఆర్ తెలంగాణను తెచ్చాడు. నువ్వేం తెచ్చావు? మా కడుపు కొట్టి ఇళ్లను కూల్చడానికి వచ్చావు. ఏదైనా మంచిపని చేసి శభాష్ అనిపించుకో’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సదరు మహిళ విమర్శించింది.