HYDRAA: వేటిని కూల్చివేస్తున్నామంటే... స్పష్టతనిచ్చిన 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్
- ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అక్రమ కట్టడాలనే కూల్చివేస్తున్నామని వెల్లడి
- ప్రజలు నివసించే నిర్మాణాల జోలికి వెళ్లడంలేదని స్పష్టీకరణ
- ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఉండే స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని సూచన
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా... ఇవాళ కూడా పలు కూల్చివేతలతో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో, కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరింత స్పష్టత ఇచ్చారు.
నిబంధలనకు విరుద్ధంగా ఉండి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నట్టు వెల్లడించారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ... ఆయా నిర్మాణాల్లో ఎవరైనా నివాసం ఉంటే ఆ నిర్మాణాలను కూల్చడంలేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రజలకు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటున్న స్థలాలను, ఇళ్లను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు.
మల్లంపేట చెరువు బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలు నిర్మాణ దశలో ఉన్నాయని, అందుకే వాటిని కూల్చివేస్తున్నామని రంగనాథ్ వివరించారు.
ఇక సున్నం చెరువులో వాణిజ్యపరమైన నిర్మాణాల కూల్చివేతలపై స్పందిస్తూ... గతంలోనే ఇక్కడి షెడ్లను కూల్చివేసినప్పటికీ మళ్లీ నిర్మిస్తున్నారని, అందుకే వాటిని కూల్చివేస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు.