Revanth Reddy: జర్నలిస్టులకు భూ కేటాయింపు పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
- జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఇళ్ల స్థలాల కేటాయింపు
- హైదరాబాద్ రవీంద్రభారతిలో పత్రాల పంపిణీ
- అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయింపు పత్రాలు అందజేశారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అయితే, ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఆ వాస్తవం సాకారం కాకముందే 73 మంది జర్నలిస్టులు కన్నుమూశారని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని... జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.