Leopard: చిరుత ఇంకా రాజమండ్రి శివార్లలోనే ఉంది... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎఫ్ఓ భరణి
- రాజమండ్రి శివార్లలో చిరుత కలకలం
- రేడియో స్టేషన్ లో కనిపించిన చిరుత
- 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ సిబ్బంది
- దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత కదలికలు గుర్తించామన్న డీఎఫ్ఓ
రాజమండ్రిలో చిరుతపులి కలకలం కొనసాగుతోంది. రాజమండ్రి శివార్లలోని ఆల్ ఇండియా రేడియో కేంద్రం వద్ద చిరుతపులి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ పందిని వెంటాడుతూ చిరుత రేడియో కేంద్రంలోకి ప్రవేశించింది.
దీనిపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) భరణి స్పందించారు. ఆ చిరుత ఇంకా రాజమండ్రి శివారు ప్రాంతాల్లోనే సంచరిస్తోందని వెల్లడించారు. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పులి కదలికలు గుర్తించామని చెప్పారు. చిరుతను గుర్తించేందుకు 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేశామని వివరించారు.
చిరుత సంచారం నేపథ్యంలో, రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని పొలాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని డీఎఫ్ఓ భరణి సూచించారు. రాత్రివేళ పొలాల్లో ఒంటరిగా పడుకోవద్దని స్పష్టం చేశారు.