Gudivada Amarnath: పడవలపై దుష్ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్: గుడివాడ అమర్ నాథ్
- ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చన్న అమర్ నాథ్
- బుడమేరుకు వరద వస్తుందని తెలిసినా పట్టించుకోలేదని మండిపాటు
- విజయవాడ మరణాలు ప్రభుత్వ హత్యలే అని ఆరోపణ
విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో... దీని వెనుక వైసీపీ కుట్ర కోణం ఉందని అధికారపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ... ఆ పడవలు వైసీపీ నేతలవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని... బోట్ల ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చని చెప్పారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ విపత్తు సంభవించిందని అమర్ నాథ్ విమర్శించారు. బుడమేరు కాల్వకు వరద వస్తుందని 20 గంటల ముందే తెలిసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. డీఈ చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడటంపై లేదని అన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని చెప్పారు.
వరదల కారణంగా ప్రజలు మునిగిపోతారని తెలిసినా నిర్లక్ష్యం వహించారని అమర్ నాథ్ మండిపడ్డారు. విజయవాడ వరద మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. దీనికి చంద్రబాబు, అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు. గతంలో అల్లూరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు 250 గ్రామాల ప్రజలను తాము రక్షించామని అన్నారు. జేసీబీలపై చంద్రబాబు తిరగడం ప్రచారం కోసమేనని ఎద్దేవా చేశారు.